janaprabha

janam kosam manam

దళితుల హక్కులు మానవ హక్కులే

 

తెలంగాణ

ఆధిపత్య కులాల బలీయమైన సామాజిక వ్యవస్థ కారణంగా కుల వివక్ష నిరంతరం ఏదో ఒక రూపంలో అన్ని చోట్ల బలంగా పనిచేస్తూనే ఉంది. దళిత కులాల వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనీయకుండా అణగదొక్కుతోంది. దళిత హక్కుల పోరాట సమితి (డి.హెచ్.పి.యస్), దళిత మహాసభ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, జాతీయ మానవ హక్కుల ప్రచారోద్యమం, దళిత, బహుజన ఫ్రంట్‌, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, కుల నిర్మూలనా పోరాట సమితి, అంబేద్కర్‌ యువజన సంఘం, సఫాయి కర్మచారి ఆందోళన్‌, జోగినీ వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి, అరుంధతీయ బంధు సేవా మండలి, దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబవ, అరుంధతీయ ఫెడరేషన్‌, డఫోడమ్‌ మొదలగు ఎన్నో సంస్థలు దళితులపై కొనసాగుతున్న కుల వివక్ష, దోపిడీలకు, దాడులకు, దళిత మహిళా జాతిపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలుకు వ్యతిరేకంగా, దళిత కులాల హక్కుల కోసం ఉద్యమాలు చేసాయి చేస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో 2001లో దక్షిణాఫ్రికాలోని దర్బన్‌ నగరంలో జాతి వివక్ష, ఇతర వివక్షలకు వ్యతిరేకంగా ప్రపంచ మహాసభలు జరిగాయి. దళిత మానవ హక్కుల ప్రచారోద్యమ వేదిక ఆధ్వర్యంలో పైన పేర్కొన్న కొన్ని సంఘాలు భారతదేశ దళితులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రపంచ మహాసభల్లో పాల్గొనడం జరిగింది.

అధికరణం 15 ద్వారా భారత రాజ్యాంగం అంటరానితనాన్ని రద్దు చేసింది. కానీ దేశంలో వేళ్లూనుకుపోయిన కౄరమైన కుల సామాజిక వ్యవస్థ అనేక రూపాల్లో ఇంకా వివక్షలను కొనసాగిస్తూనే ఉంది. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం అంటరాని కులాలుగా పిలువబడిన కులాలు స్వాతంత్ర్యానంతరం షెడ్యూల్డ్‌ కులాలుగా మారాయి. వివక్షలు కొత్త రూపాలు ధరిస్తూ వీరిపై దేశంలో నేటికీ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లెక్కకు మించిన దురాగతాలు దళితులపై దాడులు, హత్యలు, మానభంగాలు, కొనసాగుతూనే ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంటరానితనం వల్ల అంటరానివారు సిగ్గు పడాల్సిన పని లేదు. అంటరానితనాన్ని పాటిస్తున్న వారే సిగ్గుపడాలని అంబేద్కర్‌ అన్నారు. అస్పృశ్యులకు చదువులు నేర్పి, ఉద్యోగాలిచ్చి, ఇండ్లు కట్టించి, వారి సంక్షేమం చూసినంత మాత్రాన అంటరానితనం పోదని కూడా అంబేద్కర్‌ రాశారు. ఇండియాలో సాంఘిక సంస్కరణ అంటే కుల నిర్మూలనేనని ఆయన అప్పుడే తేల్చేశారు. వెట్టిచాకిరీ, అంటరానితనం, నిరక్షరాస్యత, పేదరికం, అశక్తత, జోగినీ వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ, పాకీ వృత్తి, పారిశుధ్య పని వ్యవస్థలు దళితుల మధ్య పాతుకొనిపోయాయి. తిట్లతో హీనపరచడం, వేధింపులు, దోపిడీ, హింసలు వీరిపై జరుగుతూనే ఉన్నాయి. భూమిపై హక్కులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దళితులు దూరంగా ఉంచబడుతున్నారు. ఆలయాల్లో, హోటళ్లలో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశాలపై దళితులపై వివక్ష వీడనే లేదు. అన్ని చోట్లా అవకాశాల చట్రం నుండి వెలుపలికి నెట్టివేయబడుతుండటం (మార్చినలైజేషన్‌) ఈ ”మాజీ” అంటరాని కులాలపై నేటికీ పెద్ద ఎత్తున అమలవుతున్నది. స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగం అంటరాని కులాలను షెడ్యుల్డ్‌ కులాలుగా గుర్తించింది కాగా మనువాదాన్ని పాటిస్తున్న ఆధిపత్య కుల వ్యవస్థ ఎస్సీలను ముట్టరానివారిగా, కడ జాతులుగానే ఇప్పటికీ పరిగణిస్తున్నది. డాక్టర్‌ అంబేద్కర్‌ కాలం నుంచీ జరిగిన ఆత్మగౌరవ, మానవ హక్కుల ఉద్యమాల నేపథ్యంలో ఎస్సీలు తమను తాము దళితులుగా, అణగారిన తరగతులుగా పిలుచుకుంటున్నారు. భారత ప్రభుత్వం 1955లో ఎస్సీల హక్కుల పరిరక్షణ కోసం ”పౌర హక్కుల పరిరక్షణ చట్టం” చేసింది. కుల వివక్ష శిక్షార్హమైన నేరంగా ఈ చట్టం ప్రకటించింది. కానీ బాధితులకు ఈ చట్టం గురించిన అవగాహన నేటికీ లేకపోవడం విచారకరం. ఈ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం అమలుకు తగినంత పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే చెప్పాలి ఇది వాస్తవం.
1985లో కారంచేడు మాదిగ ఉద్యమం దేశాన్నీ, పాలకులనూ కదిలించింది. దీని ఫలితంగా భారత పార్లమెంటు 1989లో ”ఎస్సీ, ఎస్టీలపై లైంగికదాడుల నిరోధక చట్టం” చేయడానికి కారంచేడు ఉద్యమం నేపథ్యమై నిలిచింది. 1991 నాటి చుండూరు ఉద్యమం ఇందుకు నేపథ్యమై నిలబడింది. అంతేగాదు, ఈ ఉద్యమం తర్వాత 105 మంది పార్లమెంటు సభ్యులతో చరిత్రలో తొలిసారిగా (ఎస్సీ, ఎస్టీ ఎంపీల పార్లమెంటరీ ఫోరం) ఏర్పడింది. దళితుడే రాష్ట్రపతి కావాలన్న నినాదంతో పోరాటం పుట్టింది. దీని తర్వాత కెఆర్‌.నారాయణన్‌ తొలి దళిత రాష్ట్రపతిగా ఎన్నికై ప్రతిష్టాత్మకంగా, అద్వితీయంగా ఈ పదవి నిర్వహించారు. దేశంలో, రాష్ట్రంలో కొనసాగిన దళిత ఉద్యమాలు సాధించుకున్న కొన్ని గొప్ప విజయాలుగా వీటిని చెప్పుకోవచ్చు.
ఆధిపత్య కులాల బలీయమైన సామాజిక వ్యవస్థ కారణంగా కుల వివక్ష నిరంతరం ఏదో ఒక రూపంలో అన్ని చోట్ల బలంగా పనిచేస్తూనే ఉంది. దళిత కులాల వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనీయకుండా అణగదొక్కుతోంది. పుట్టుక, వృత్తి ఆధారంగా 26 కోట్ల మంది దళితులు అంటరానితనాన్ని, కుల వివక్షను ఎదుర్కొంటున్నారని, వివక్షల వ్యతిరేక ప్రపంచ మహాసభల్లో ఈ సంఘాలు ప్రపంచానికి చాటి చెప్పగలిగాయి. 1948లో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో జాతి, మతం, రంగు, ప్రాంతం, భాష, లింగ వివక్షలను నిర్మూలిస్తామని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితీ తీర్మానం ద్వారా ప్రకటించాయి. ఈ తీర్మానంపై భారత ప్రభుత్వం కూడా సంతకం చేసింది. కాగా, నిర్మూలించాల్సిన వివక్షల జాబితాలో కుల వివక్షను కూడా చేర్చుతూ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనను సవరించాలని ప్రపంచ మహాసభల్లో భారత దళిత సంఘాల ప్రతినిధుల డిమాండ్లను నాటి భారత ప్రభుత్వ అధికార ప్రతినిధులు తొక్కిపెట్టారు, అడ్డుకున్నారు. రోజురోజుకూ దళితుల మానవ హక్కులు మృగ్యం అవుతున్నాయి. ఆధిపత్య వ్యవస్థల వివక్షలు, అణచివేతలే ఇందుకు కారణం. పేదలు, నిరక్షరాస్యులు అయిన కోట్లాది మంది దళితుల విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ మానవ హక్కుల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో పౌర సమాజం, ప్రజా సంఘాలు అండగా నిలవాలి. ప్రభుత్వ ఉద్యోగి వర్గం సానుకూలంగా మారాల్చిన అవసరం ఉంది. దళిత మానవ హక్కుల గ్యారంటీకి ప్రతి ఒక్కరూ సానుభూతితో, సమోదరత్వంతో సిద్ధం కావాలి. ముందుకు రావాలి. అప్పుడే దళితుల హక్కులు కూడా మానవ హక్కులుగా గుర్తించబడతాయి. మనుగడ సాగిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *